కొంగ దంపతుల కధ
అనగనగా మగధదేశములోని ఒక సామంత రాజ్యములో రాజమహలుకు దగ్గరలో ఒక పెద్ద చెఱువు కలదు. దాని ఒడ్డున ఒక ఎతైన రావి చెట్టు కలదు. ఆ రావి చెట్టుపై ఒక కొంగ దంపతులు కలవు. ఆ రావి చెట్టు క్రిందనే ఒక పెద్ద పాముపుట్ట కలదు. ఆ పాము పుట్టలో ఒక పెద్ద పాము వుండెను. ఆ చెఱువునందలి నీరు స్పటికము వలె నిర్మలముగానూ, తీయగానూ వుండెను. ఆ నిర్మలమైన చెఱువు జలము నందు జలకములాడుటకు, ఆ సామంతరాజు కూతురు తన చెలికత్తెలతో ప్రతిదినము వచ్చును. చాలాసేపు జలకములాడి, తన చెలికత్తెలతో తిరిగి అంతఃపురమునకు వెడలెను.
ఆ చెట్టుపైనున్న కొంగలు, రోజూ ఆహరము కొఱకు చెట్టును వదిలి దూరముగా వెళ్ళి సాయంసంధ్యా సమయమునకు తిరిగి చెట్టును చేరును. ఇది వాటి దిన చర్య. ఆ కొంగలు ఆ చెట్టుపై గూడు కట్టుకొని అందు ప్రతిదినము గ్రుడ్లు పెట్టును. ఆ గ్రుడ్లును గూటిలో వదిలి ఉదయమే ఆహారమునకై ఆ కొంగ దంపతులు దూర ప్రాంతములకు వెళ్ళెను. ఆ సమయమున చెట్టు క్రింద గల పుట్టలోని పెద్ద పాము మెల్లగా చెట్టునెక్కి ఆ కొంగ గ్రుడ్లను మింగి కిందకు దిగి వచ్చును. సాయంత్రము కొంగ దంపతులు తమ గ్రుడ్లను కానక చాలా దుఃఖించెను. తరువాత ఆ కొంగ దంపతులు మరల తమ గూటిలో గ్రుడ్డును పెట్టి, ఆహారమునకై పోయి వెంటనే తిరిగివచ్చి దగ్గరిలోని వేరొక చెట్టిపైకెక్కి తమ చెట్టు వంక చూచు చుండిరి. ఇంతలో చెట్టు క్రింది పుట్టలోని పాము మెల్లగా చెట్టుపైకి పాకుచుండెను. తరువాత కొంగ దంపతులు చూచు చుండగానే పాము గూటిలోని గుడ్డును మింగి క్రిందకు దిగి వచ్చి తన పుట్టలోనికి వెళ్ళిపోయెను. కొంగ దంపతులు ఆ రోజు గూటిలోనికి వెళ్ళి చాలా దుఃఖించిరి. తమకు ఈ పాము వలన సంతాన ప్రాప్తిలేదని చింతించి పాము బారినుండి తప్పంచుకొనుటకు ఉపాయము ఆలోచించ సాగెను. ఒక నాడు ఆ కొంగ దంపతులకు ఒక చక్కని ఆలోచన వచ్చెను.
ఒక నాడు ఆ సామంతరాజు కూతురు జలకమాడు చుండెను. ఆ సమయమున చెట్టు పైనున్న మొగ కొంగ వెంటనే రాజకుమారి హారమునొకదానిని ముక్కున పట్టుకొని పైకెగరెను. వెంటనే రాజకుమారి ఆ విషయము సైనికులకు తెలుపగా, వారు బల్లెములు, శూలములు, కత్తులతో ఆ కొంగను వెంబడించెను. అప్పుడు కొంగ కొంత దూరము సైనికులను తిప్పి వెంటనే వచ్చి పాము పుట్టలో హారమును వేసెను. వెంటనే రాజ భటులు ఆ పాము పుట్టను, బరిసెలతో, బల్లెములతో తవ్వి మధ్యలో కనిపించిన పామును చంపి, ఆ హారమును తీసుకొని రాజకుమారికి ఇచ్చిరి. పాము చనిపోయెను. కొంగ దంపతులు చనిపోయిన పామును చూచి సంతోషించిరి.
నీతి: బలహీనుడు తాను చేయలేని పనిని తెలివిగా, ఉపాయముగా బలవంతులచేత చేయించుకొన వలెను.