Tuesday, September 17, 2013

Vinayaka chaviti

వినాయక చవితి:


ఓం వినాయకాయనమః

ఓం విఘ్ననాధాయనమః

భాద్రపద మాసమునందు మొదటి నాల్గవ రోజున వచ్చు పండుగ. అనగా శ్రావణ మాసము అమావాస్యతో అంతమై, మరు రోజునుండి భద్రపద మాసము మొదలగును. ఆ విధముగా మొదలైన దినమును భద్రపద శుద్ధ పాడ్యమి అందురు. దీనినే భదపద మాస శుక్ల పాడ్యమి అని కూడా పిలుతురు. అనగా భద్రపదమాస శుద్ధ లేక శుక్ల పాడ్యమిని వినాయక చవితి అనియు, గణేశ చతుర్ధి అనియు పిలుతురు.

ఏపూజను గృహమునందు చేసుకొన చున్నను లేక ఏ వ్రతము గృహమునందు ఆచారించు చున్నను ప్రప్రధమముగా వినాయకుని, తాముచేయు ఏపని యందైనను విఘ్నములు రాకుండా, అడ్డు పడ కుండా కాపాడమని వేడుకొనుచూ పూజ భరత దేశమంతటామనము జరుపు కొనుచుందుము. విగ్రహప్రతిష్టాపనను ఆగమశస్త్ర రీతిలో జరుపుకొనిన దేవాలయమందైననూ లేక ఏబహిరంగ ప్రదేశమునందు పందిరివేసి ఏ పూజ గాని, వ్రతముగాని, భజనగాని హరికధగాని, బుర్రకధగాని, వివాహము గాని, యఙ్ఞోపవీత సంస్కారము, ఏ పనియైగాని జరుపుకొన్నచో ప్రప్రధమముగా విఘ్నేశ్వర పూజ తప్పక చేయవలెను. లేనిచో ఆ కార్యక్రమమునకు విఘ్నములుకలునునని భారతీయుల నమ్మకము. మనకున్న నాలుగు యుగములు చక్రభ్రమణములో ఒకదానివెంట ఒకటి అనగా కృతయుగము (సత్యయుగము) తర్వాత త్రేతయుగము తర్వాత ద్వాపరియుగము. దాని తర్వాత కలియుగము తరువాత మరల సత్యయుగము ప్రారంభమయి చక్రభ్రమణము జరుగుతూనేవుంటుంది. కావున ఒకసారి ఒకయుగమునందు వచ్చిన విఘ్నేశ్వరుని పండుగ అయిన వినాయక చవితిని, పూర్వము పరమశివుడు పార్వతిని వివాహమాడు సందర్భమున ముందుగా విఘ్నేశ్వరుని పూజ ఆచరంచెను. అదేమిటి, తన పుత్రునే తండ్రి పూజింతునాయని సందేహమువలదు. విఘ్నేశ్వరుడు, శివపార్వతుల తనయుడే కాని విఘ్నములకు అధిపతియైన కారణమున, ఆదిదంపతులైన శివపార్వతుల వివాహమునకు విఘ్నేశ్వరుని పూజ జరుపు కొనిరి. మన తిధులు చంద్రమాసములు (చంద్ర ఉదయ, అస్తమయములపై ఆధారపడును) గనుక తెలుగు క్యాలెండరును గానీ పంచాంగమును గాని తీసుకొని భాద్రపద శుధ్ధ చతుర్ది ఎప్పుడు వచ్చినదో చూచికొని వలెను. ఆరోజురాత్రి కూడ చవితి ఘడియలు వుండి మరునాడు ఎప్పుడైనా చవితి వెళ్ళిపోయి పంచమి వచ్చినచో అనగా రాత్రి వేళమాత్రము చవితి ఘడియలు వుండవలయును. అట్టి రోజున చవితి ఘడియలలోనే వినాయక వ్రతమును ఆచరించవలెను. అలా వ్రతమును చేసికొనకుండా ఆ రాత్రి చంద్రుని చూచినచో నీలాపనిందలు ప్రాప్తించును.

విఘ్నేశ్వరుని ఆవిర్భవము:

పూర్వము "గజముఖుడు" అను రాక్షసుడు గలడు. అతని తల ఏనుగుతల. ఆరాక్షసుని చూడగానే ఏనుగును చూచినట్లున్నందు వలన అతనికి గజముఖుడు అని పేరు వచ్చేను. ఒక సారి ఆ గజముఖ రాక్షసుడు, భక్తసులభుడను శివుని గురించి తపస్సు గావించెను. అతని భక్తికి కడుంగడు సంతసించి శివ భగవానుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనెను. అప్పుడు గజముఖుడు చాలా ఆలోచించెను. రాక్షసవైరియైన శ్రీకృష్ణ పరమాత్మ చాలా మోసకారియనియు, ఏలాంటి వరమును మృత్యువు రాకుండా కోరిననూ, అందులోని లొసుగును కనుగొని సంహరించుననియు భయపడి, తనను ఎవ్వరును సంహరించకుండా శ్రీమహాశివుని తన వుదరమందు (పొట్ట) వుండునట్లు వరము పొందెను. శ్రీమహా శివుడు చిరునవ్వుతో ఆ వరమును ప్రసాదించెను. ఆ నాటి నుండి గజముఖుడు ఏ భయము లేకుండవుండెను. గజముఖుని వరము కైలాసమందున్న పార్వతీదేవిని ఒటరి దానిని చేసెను.ఆమె తనభర్త రాకకై ఎదురు చూచుచూ కొన్ని దినములు దుఃఖములో గడుపు చుండగా ఆమె ఒకనాడు విష్ణువును ప్రార్ధించుచెను. శ్రీమహా విష్ణువు ఏమీ తెలియని వానివలె, ప్రమధ గణములన్నింటిని చతుర్ధశ భువనాలను శివునికొరకు వెదకమని ప్రేరేపించెను. వారు గాలించి చివరకు పాతాళమున గజముఖుని ఉదరమున శివుని ఉన్నట్లు తెలిసికొని కైలాసమున పార్వతిదేవి, విష్ణువులకు తెలిపెను. అంత మహా విష్ణువు గంగిరెద్దుల వాని వేషము ధరించి, శివుని వాహమైన నందిని గంగిరెద్దులా అలంకరించి ప్రమధగణములు తోడు రాగా, పాతాళమును చేరి గజాసురుని ముందు, గంగి రెద్దు అయిన నందిని వివిధరకముల వాద్య ఘోషలతో ఆడించెను. అంత గజాసురుండు అమాయకంగా ఆగంగిరెద్దుల ఆటను తిలకించి ఆ గంగిరెద్దు హావ, భావ, నాట్య మునకు సంతసించి ఇట్లనెను, "ఓయీ! గంగిరెద్దుల వాడా! నీలోని నైపుణ్యము అమోఘమైనది. నీకు ఏవరము కావాలో కోరుకో". పిమ్మట శ్రీహరి, నంది, ప్రమధగణములు తమతమ స్వరూపములతో ఆ గజాసురిని వేనోళ్ల పొగిడిరి. అప్పుడు శ్రీహరి, "ఓ గజముఖ! నీవు ముల్లోకములను పాలించవలసిన శ్రీ మహా శివుని నీవుదరమందు బంధించితివి. దీనివలన సృష్టి, స్ధితి, లయ క్రియలకు తీవ్ర అంతరాయము వాటిల్లినది. కావున నీవుమాకు శ్రీమహా శివుని అర్పింపు" అనెను. అంత గజముఖుడు ఇలా అనుకొనెను, "ఆ వచ్చిన వాడు రాక్షసాంతకుడగు శ్రీహరి. ఆస్వామి స్వయంగా వచ్చెను గావున, నామరణము తధ్యము" అని నిశ్చయించుకొని తన కడుపులోని చ్రీ మహాదేవుడైన శివునికి నమస్కరించి ఇట్లనెను, "మహాశివా! దీనజన రక్షకా! ఆర్తత్రణ పరయణా! నీవు ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళు సమయము ఆసన్న మయ్యెను. నా మొర ఆలకించి నాతలను లోకపూజ్యముచేయుము. నాచర్మమును మీరే స్వయముగా ధరించి నన్ను ఆదరంచము", అని పలికగనే, 'అట్లే' యని మహాదేవుడు సెలవెచ్చెను. అంత శ్రీహరి, నందీశ్వరునకు అనుఙ్ఞ నీయగా ఆయన వెంటనే తన వాడియైన కొమ్ములతో ఆ గజాసురుని గర్భము చీల్చి శ్రీమహాశివుని విముక్తి గావించెను. చారుల వలన శ్రీమహావిష్ణువు విజమును, తన భర్త రాకనుగురించి తెలుసుకొనిన పార్వతీదేవి, అభ్యంగన స్నానమొనరించి, సుచియై తన భర్తకు స్వాగతమీయుటకొరకు ఉపక్రమించెను.


శ్రీమహా గణపతి ఆవిర్భావము:

పార్వతీదేవి అభ్యంగ స్నానమాచరించుటకై, శరీరమంతయునూ నూనెచే మర్దించుకొని సున్నిపిండితో నలుగు బెట్టించుకొన్నుచుండగా, శరీరముపై నున్న నూనెను పీల్చిన సున్నిపిండి ముద్దలు రాలిక్రింద పడెను. పార్వతీదేవి ఆ నూనెతో ఒక మగపిల్ల వానిని తయారుచేసి ప్రాణముపోసెను. అలా నలుగుతో తయారైన పిల్లవానిని వాకిలివద్ద కాపలాగా వుంచి తాను స్నానముచేయుటకు వెడలెను. ఇంతలో మహాశివుడు గజముఖుని తలతీసుకొని రక్తమువోడుతున్న తన చర్మముని ధరించి వచ్చెను. అంత ఆ వికృతరూపమును చూచి భయపడెను. ఆ పిండి బాలుడు శివుని లోపలికి పోనివ్వలేదు. శివుడు ఇది తన ఇల్లు అని చెప్పెనూ వినక నిరాకరించెను. అంత మహా శివుడు విసుగుతోకూడిన క్రోధముతో ఆ బాలుని తలను నరికి లోనికి వెడలెను. ఇంతలో పార్వతి వచ్చి, భర్తను లోనికి ఆహ్వానించి, స్నానాదికములను ఆచరింప జేయించి, మృష్టాన్న భోజనము ఆరగింపజేసి,విశ్రాంతినిచ్చి, తాను భర్త పాదములు వత్తుచూ ఉభయములు గోష్టికావించు చుండిరి. మాటల ప్రస్తావనలో వాకిటిలోని బాబు తలనరకినట్లు శివుడు పార్వతితో చెప్పను. అంత పార్వతి అత్యంత దుఃఖముతో "నాధా! మనకు సంతానము లేనందున, నలుగు పండితోనేను బొమ్మను చేసి ప్రాణ ప్రతిష్ట చేసుకుంటిని. అట్టి మన పుతృని మీరు సంహరించి నన్ను సంతాన రహితునిగా చేసిరి. ఎటులైననూ నాముద్దుల తండ్రిని బ్రతికింపుడు అని దీనముగా శివుని వేడుకొనెను. అప్పుడు మహాదెవుడు, ఆ పిల్లవానికి తానుతీడుకొని వచ్చిన గజాననుని తలను అతికించి, బ్రతికించెను. దానికి పార్వతి సంతమముతో గజాననుడు అని పిలుచుకొను చుండెను. ఆ రోజు, భాద్రపద శుద్ద చతుర్ధి గజాననుని పుట్టినరోజు అయినది. 


కుమార స్వామి జననము:

అంతనొక నాడు పార్వతీదేవి అన్యమనస్కంగావున్న తరుణమున శ్రీమహాదేవుడు గమనించి, చెంతకుచేరి, కుశలప్రశ్నలు కావించి, చింతకు కారంమెమని అడిగెను. అంత పార్వతీదేవి తమకు పుట్టిన సంతనములేదే అని చింతకు కారణము చెప్పెను. అప్పుడు శివుడు, మహాతపశ్శాలులైన శ్రీ సనత్సుజాతుని ఇలా ప్రార్ధించెను, "ఓ మహాతపశ్వీ! తమరు నాకు పుత్రప్రాప్తికై వరమొసంగు" మన, శ్రీ సనత్సుజాతుడు అట్లే వరమొసంగెను.

ఇంటికి సంతోషముగా వచ్చిన పరమశివుని వలన విషయము తెలుసుకొనిన పార్వతీదేవి భర్తతో, "ఎంత పనిచేసితివయ్యా, పరమ శివా! నీకు సంతానము ఎలా కలుగును? మనకు కదా సంతానము కలుగవలసినది. నీవు తల్లివై సంతానము పొందవలయుననిన మరి తండ్రి ఎవరు?" అనిన పరమేశ్వరుడు తన పొరపాటుకు వగచెను. తరువాత కానున్నది కాకమానదని అన్ని విషయములు మరచి పార్వతీపరమేశ్వరులు కైలాసపర్వతమున శుఖముగా కాలము గడుపు కొనుచుండిరి.

అంత నొకనాడు పార్వతీపరమేశ్వరులు సంతోషముగానున్న సమయము చూచి దేవేద్రుడు, వారిద్దరి సంతోషమును భంగ పరుచమని అగ్నిదేవుని ప్రేరేపించెను. అంత అగ్నిదేవుడు చిలక రూపముతో పార్వతీ శివులున్న ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి మెల్లగా శివుని ధ్యానింపనారంభించెను. అంత శివుడు బయటకు వచ్చి తమ ఏకాంతమునకు భంగమొనర్పిన వారెవరాయని చూచుసమయమున శివుని తేజ్జస్సు శివుని నుంచి వెలువడినది. దాని శక్తిని తనలో ఇమడ్చికొనెను. తడుపరి ఆ శక్తి భరంచలేక గంగానదిలో వదిలెను. గంగా నదిఆశక్తిని పిల్లవానిగా తనలో ఎనిమిది నెలలు భరించి తట్టుకొనలేక బయటకునెట్టివేసెను. ఆ బాబు రెల్లుపొదలోపడి ఏడ్చుచుండ ఆరుగురు కృత్తికలు వెంటనే వచ్చి ఆ బుడ్డకు తమ స్తన్యములునిచ్చెను. ఆ బాబు వెంటనే ఆరు ముఖములతో ఆరుగురి వద్ద స్తన్యమును గ్రోలి షన్ముఖుడు అయ్యెను. కృత్తికల స్తన్యము గ్రోలినందున 'కార్తికేయు'డాయెను. ఆయనయేగజాననుని తమ్ముడు కుమార్ స్వామి. ఇతడు మహాబలవంతిడు. అతని వాహనము నెమలి. ఇతను దేవతలకు సేనానాయకుడై ప్రసిధ్ధిగంచెను.



విఘ్నేశ్వరాధిపత్యము:

ఇది ఇలా వుండగా ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి, విఘ్నములకు ఒక నాయకునితమకొసంగుమని కోరిరి. అంత గజాననుడు తాను జ్యేష్ఠుడనుగనుక విఘ్నాధిపత్యము తనకిమ్మని కోరెను. కానీ కుమారస్వామి తన అన్న మరగుజ్జుమూషిక వాహనారూఢుడు, ఎక్కడికిని త్వరతగతిన ప్రయాణము చేయలేడు అమయర్ధుడు, కావున విఘ్నాధిపత్యము తనకివ్వమని కోరెను.

ఆ సమయమున మహేశ్వరుడైన శివుడు ఇలాచెప్పెను, "గజానన కుమారస్వాముల మధ్య పోటీలో ఎవరు గెలిచిన, వారు విఘ్నాధి పతులగుదురు. పోటీఏమనగా వీరిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకనులందలి పుణ్య నదులలో స్నానమాడి ముందుగా వచ్చిన, వారే గణనాయకులు, గణాధ్యక్షులు, గణపతి అనుదురు" అనెను.

కుమారస్వామి పరమశివుని మాట పూర్తి కాకమునుపే నెమలి వాహనముపై ముల్లోకములందలి పుణ్య నదులలో స్నానమాడుటకు బయలుదేరెను. కాని గజాననుడు మాత్రము వున్నచోటినుండి మెల్లగా, తన బరువైన మరగుజ్జు శరీరముతో పార్వతీ పరమేశ్వరుల వద్దకు వచ్చి, తల్లిదండ్రులకి పాదాభివందనమాచరించి ఇట్లు ప్రార్ధించెను, "తండ్రి! నేను పూర్తిగా అసమర్ధుడనని తెలిసి కూడా, మేరు ఇలాంటి షరతులు విధించతగునా, నేను మూషిక వాహనుండనయి ఎన్నడు పోవలె, ఎన్నడు రావలె. నాకు ఉపాయంబు సెలవియ్యరే" అనిప్రార్ధింపగా, పరమ శివుడు ప్రసన్నుడై ఇట్లు పలికెను, "ప్రియపుత్రా! మన వేధపురాణములు ఘోషించుచున్న వెధముగా, ఒకసారి నారాయణ మంత్రమును జపించినంత మాత్రముననే మూడు వందల కల్పంబులు సమస్త పుణ్యనదులలో స్నానమొనర్చిన ముణ్యము కల్గును" అని పరమశివుడు, గజాననునికి నారాయణ మంత్రము ఉపదేశించెను. అంత గజాననుడు అత్యంత భక్తి శ్రధ్ధలతో నారాయణ మంత్రమును జపించుచూ కైలాసముననే వుండెను. 'నారాయణ' మంత్ర ప్రభావమున, అచట కుమారస్వామికి తన కంటేముందే గజాననుడు ప్రయాణించు చున్నట్లు కనపడు చుండెను. తాను ఏనదిలో స్నానమాడుటకు బయలుదేరునో, ఆనది నుంచి స్నానాదికములాచరించి తిరిగి వచ్చుచూ గజాననుడు కనుపించ సాగెను. ఇందులకు కుమారస్వామి అత్యంత ఆశ్చర్యముతో మూడు కోట్ల ఏబదిలక్షల నదులలో స్నానమాచరించి ప్రతి చోట గజాననుడు ముందు వుండుటను గమనించి కైలాసమునకేగి అచ్చటనూ పార్వతీపరమేశ్వరుల సన్నిధిని తనకంటె ముందుగానే విచ్చేసి తల్లిదండ్రులతో, "పూజ్య తల్లిదండ్రులారా! అన్నగారైన గజాననుని సామర్ధ్యమెరుంగక గొప్పలు పలికితిని. నన్ను క్షమించుము, అన్నగారే విఘాధిపత్యమునకు అర్హులు" అని పలికెను. అందులకు పార్వతీపరమేశ్వరులు సంతసించి సభతీర్చి, నిండు పేరోలగమున, గజాననునికి విఘ్నాధిపత్యమునొసగెను. ఆనాడు సర్వదేశెస్ధులు, విఘ్నాదిపతియైన వినాయకునికి తమతమశక్తికొలది కుడుములు, వుండ్రాళ్ళి, మోదకములు, పాలు, పండ్లు, టెంకాయలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించుకొని పూజించిరి. వాటిని కడుపు నిండుగా తృప్తిగా ఆరగించి, కొన్నింటిని తన వాహనమైన అనింద్యుడు అను మూషికమునకొసంగి, కొన్నింటిని చేతనిడుకొని, మందగమనముతో కైలాసమునకు సూర్యాస్త మయవేళకు చేరి తల్లిదండ్రులకు వంగి నమస్కరింపబోవ కాళ్ళి నేలకొనను చేతులు పైకిలేచును, చేతులు నేలకొనింపబోవ కాళ్ళు పైకిలేచుచు, చూచువారలకు ఆనందపరచు పిల్ల చేష్టల వలె హాస్యముగా వుండి నవ్వు తెప్పించెను. కాని ఇప్పుడు గజాననుడు గణాధిపతియైనందున, భయముతో ఆ నవ్వును ఎటులో ఆపుకొనెను. కాని శివుని తలపైనున్న చంద్రుడు మాత్రము నవ్వును ఆపుకొనలేక పకాలున పెద్దగా వికరముగా నవ్వెను. 'రాజ దృష్టిసోకిని, రాళ్ళుకూడా కరుగును' అనునట్లుగా గణనాయకుని తోరపు బొజ్జ పగిలి అందుండి కుడుములు, ఉండ్రాళ్ళు, అపూపములు మొదలగునవి తొర్లి సభాభవనమంతయు చెల్లా చెదురాయెను. అంత పార్వతీదేవి చంద్రునిపై కోపించి 'నీ దృష్టి తగిలి నాకుమారుడు అవమానముల పాలయ్యెను కావున నిన్ను చూచిన వారు పాపాత్ములై, నీలాపనిందలు పొందుదురు' అని శపించెను.




ఋషి పత్నులకు నీలాపనిందకలుగుట:

ఆ సమయమున సప్తఋషులు యఙ్ఞము చేయుచూ, తమ పత్నులతో అగ్నిప్రదక్షిణముచేయు చుండిరి. ఆ సమయమున అగ్నిదేవుడు, ఋషిపత్నులను చూచి మోహించి, తన కోరికతీరదు అని తెలిసినవాడై రోజుకు క్షీణించు చుండెను. అగ్ని దేవుని భార్య స్వాహాదేవి. ఆమె తన భర్త క్షీణించుటకు గల కారణమును యోగ శక్తితో గ్రహించెను. తన భర్త కోరిక తీరుట అసంభవమని తెలుసుకొని, తనే వారి రూపమును దాల్చి తనభర్తకు ప్రియము చేకూర్చు చుండెను. కాని అరుంధతిదేవి రూపమును మాత్రము ధరించలేక పోయెను. ఋషులు మాత్రము అగ్నిదేవునితో సుఖించు చున్నది తమ భార్యలేయని భ్రమించి వారిని విడనాడిరి. ఈ నీలాపనింద, పార్వతీదేవి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచినందున గలిగినది. అంత ఈ విషయమును ఋషులు, మునులు పరమశివునికి విన్నవించు కొనగా, సర్వఙ్ఞుడగు పరమేశ్వరుడు విషయము గ్రహించి, ఋషులకు అసలు విషయమును తెల్పి సమాదాన పరిచి, "ఏ భాద్రపద శుధ్ధ చతుర్దశి నాడు విఘేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినమునమాత్రము చంద్రుని చూడరదు' అని శాపవకాశంబొసగెను. అంత బ్రహ్మాదులు సంతసించుచు ఆదినము మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖముగ నుండిరి.